AILU-KLU శిక్షణ తరగతుల మొదటి అనుభవం
Pavan Sripathi's experience on the AILU Law Trainings in KL University in June 2025.

ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (AILU) మరియు K L యూనివర్సిటీ సహకారంతో జూన్ 6 నుండి 8 వరకు న్యాయవాదుల కోసం ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు వాట్సాప్‌లో వచ్చిన సందేశం చూశాను. ఆ క్షణం మనసు ఉత్సాహంతో నిండిపోయింది. ఈ కార్యక్రమం నా న్యాయవాద జీవితంలో కొత్త ఉత్సాహాన్ని, సరికొత్త అనుభవాన్ని నింపుతుందని అనిపించింది. చాలా కాలం తర్వాత రైలు ప్రయాణం. చిన్నప్పటి నుండి హైదరాబాద్‌కి ఎన్నోసార్లు బస్సులోనే తిరిగాను. దూర ప్రయాణాలకు బస్సు నాకు విడదీయలేని స్నేహితుడిలా అయిపోయింది. కానీ ఈసారి, చివరి నిమిషంలో తత్కాల్‌లో టికెట్ బుక్ చేస్తే ఎలాగో సీట్ దొరికింది. మా అన్న “వద్దు,” అని చెప్పినా వినలేదు. నన్ను చర్లపల్లి స్టేషన్‌కి తీసుకొచ్చి రైలెక్కించాడు. ఈ అన్నలు ఎప్పుడూ ఇలాంటివారే, కదూ? ప్రేమను మాటల్లో చెప్పకుండా, చేతలతో చెప్పేస్తారు, మనసుని ప్రేమతో నింపేస్తారు! రోజూ ఒకే తరహా పనుల మధ్య కాస్త భిన్నంగా ఏదైనా చేయడానికి అవకాశం దొరోకితే కొత్త ఉత్సాహం కలుగుతుంది. ఆ ఉత్సాహంతోనే చర్లపల్లి స్టేషన్ నుండి విజయవాడకు రైలు ఎక్కాను, కొత్త అనుభవాల కోసం! రాత్రి 11 గంటల సమయంలో విజయవాడ నగరంలో అడుగుపెట్టాను. రాపిడో డ్రైవర్ నన్ను తీసుకెళ్తూ, నగరంలో వచ్చిన కొత్త మార్పుల గురించి ఉత్సాహంగా చెప్పుకొచ్చాడు. రాత్రి వెలుగుల్లో మెరిసిపోతున్న నగరాన్ని చూడడంతో మనసు ఒక్కసారిగా తేలికైపోయింది. ప్రయాణంతో వచ్చిన అలసట అంతా మాయమై, రేపటి కార్యక్రమం కోసం సిద్ధమైనట్లు అనిపించింది.
శిక్షణ తరగతులు – ఆలోచనలకు పదును మాత్రమే కాదు మానవ సంబంధాలకు బలం కూడా
మూడు రోజుల పాటు జరిగిన సెషన్స్ నిజంగా మనసును తెరిపించాయి. చట్టం ఎక్కడ నుండి మొదలైంది, కాలక్రమేణా అది ఎలా మార్పు చెందింది, ఈ రోజు దాని స్థితి ఏమిటి, చట్టాలను ఎలా అర్థం చేసుకోవాలి, న్యాయవాదుల పాత్ర ఏంటనే అంశాలపై జరిగిన చర్చలు ఒక కొత్త దృక్కోణాన్ని అందించాయి. ప్రతి సెషన్ ఆలోచనలను పదును పెట్టేలా చేసింది. ఈ సెషన్స్ నిజంగా కళ్లు తెరిపించే అనుభవంలా అనిపించాయి. ఈ మూడు రోజుల సెషన్స్ నాలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. నాలాంటి ఆలోచనలు, ఉత్సాహం ఉన్న వందలాది మంది న్యాయవాదులను ఒకే చోట చూడటం నాకు అమితమైన ధైర్యాన్నిచ్చింది. ఎంతో మంది మనసు విప్పి మాట్లాడారు, తమ అనుభవాలను, భావాలను బహిరంగంగా పంచుకున్నారు. ఈ క్రమంలో కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి, ఏ జిల్లాకు వెళ్లినా “మనవాళ్లు ఉన్నారు” అనే గట్టి నమ్మకం కలిగింది. AILU సభ్యులు అందరితో గౌరవంగా, మర్యాదగా వ్యవహరించిన తీరు నన్ను గాఢంగా ఆకట్టుకుంది.
రాజ్యాంగ విలువల్లో AILU పాత్ర
వేదికపై ఫీడ్‌బ్యాక్ ఇస్తూ, “మన రాజ్యాంగం అందరూ సమానమని చెబుతుంది. ఆ సూత్రాన్ని AILU ఇక్కడ మాటల్లో కాకుండా, చేతల్లో ఆచరించి చూపించింది,” అని మనస్ఫూర్తిగా చెప్పాను. ఇలాంటి వర్క్‌షాప్‌లు న్యాయవాదులకు, న్యాయవిద్య అభ్యసిస్తున్న వారికి కేవలం జ్ఞాన సముపార్జన కోసం మాత్రమే కాదు, ఒక కొత్త దిశను చూపే గొప్ప అవకాశ మార్గాలు కూడా. ఈ సెషన్స్ చట్టపరమైన అంశాలను లోతుగా అర్థం చేసుకోవడమే కాకుండా, సమాజంలో న్యాయం కోసం పోరాడే ఉత్సాహాన్ని కలిగిస్తాయి. వందలాది మంది సమాన ఆలోచనలు కలిగిన వ్యక్తులతో కలిసి చర్చించడం, అనుభవాలను పంచుకోవడం వల్ల ఒక సమూహ బలం ఏర్పడుతుంది. ఇది మనలో “మనం ఒంటరిగా కాదు” అనే ధైర్యాన్ని నింపుతుంది. ఇలాంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తికి కొత్త ఒరవడిని, సమాజ సేవకు స్ఫూర్తిని అందిస్తాయి.
ఇట్లు,
పవన్ శ్రీపతి
B.Sc., PGDAEM, (LL.B), (M.A. Pol Sci)
మొబైల్ : +91 87901 28781
Email: [email protected]
(ఇలాంటి మీ అనుభవాలని నాతో పంచుకోండి)