ఫోర్డ్ కారులో తయారీ లోపానికి సుప్రీంకోర్టు భారీ పెనాల్టీ – రూ.42 లక్షలు పరిహారం
Supreme Court orders Ford India to pay Rs 42L compensation to the victim of manufacturing defects.

భారత సుప్రీంకోర్టు వినియోగదారుల హక్కుల రక్షణలో ఒక చారిత్రాత్మక మలుపును తీసుకుంది. ఫోర్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన ఫోర్డ్ ఎండివర్ టైటానియం కారులో తీవ్రమైన తయారీ లోపాలు ఉన్నాయని గుర్తించిన కోర్టు, వాహన యజమానికి రూ.42 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. Ford India Private Limited Vs M/s. Medical Eleborate Concept Private Limited & Ors. (సివిల్ అప్పీల్ నంబర్లు 4192-4194/2023) కేసులో జస్టిస్ సూర్యకాంత్ మరియు జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం ఈ తీర్పును 2023, జూలై 5న వెలువరించింది.
కేసు నేపథ్యం:
చండీగఢ్‌కు చెందిన మెడికల్ ఎలబొరేట్ కాన్సెప్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, ఫోర్డ్ ఇండియా అధికారిక డీలర్ ఏ.బి. మోటార్స్ ద్వారా ఈ కారును కొనుగోలు చేసింది. అయితే, కొనుగోలు చేసిన కొద్ది రోజుల్లోనే ఆయిల్ లీకేజీతో పాటు అనేక సాంకేతిక సమస్యలు వెలుగు చూశాయి. ఈ లోపాల కారణంగా యజమాని రోజువారీ ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు మరియు మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. దీనిపై పంజాబ్ రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ను (చండీగఢ్) ఆశ్రయించాడు.
రాష్ట్ర మరియు జాతీయ కమిషన్ ఆదేశాలు:
రాష్ట్ర కమిషన్, ఫోర్డ్ ఇండియాకు కారు ఇంజిన్‌ను ఉచితంగా మారుస్తూ రోజుకు రూ.2,000 పరిహారంగా చెల్లించాలని తీర్పునిచ్చింది. ఈ తీర్పును జాతీయ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార కమిషన్ (NCDRC) ధృవీకరించింది.
పై తీర్పుపై అసంతృప్తితో ఫోర్డ్ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
సుప్రీంకోర్టు తీర్పు:
కేసు సుప్రీం కోర్టు విచారణలో ఉన్నప్పుడే, ఫోర్డ్ ఇండియా ఇంజిన్‌ను మార్చినప్పటికీ కారు రోడ్డుపై సమర్థంగా నడవడంలేదని వినియోగదారు ఆరోపించడంతో, కోర్టు తయారీ లోపాలను అంగీకరించింది. ఈ సందర్భంలో వివాదాన్ని నిర్దారణ చేసేందుకు కోర్టు ఈ క్రమంలోని ఆదేశాలను విధించింది:
- పరిహారం: వినియోగదారునికి రూ.42 లక్షలు చెల్లించాలి. ఇందులో రాష్ట్ర కమిషన్‌కు ఇప్పటికే డిపాజిట్ చేసిన రూ.6 లక్షలు తగ్గించి, మిగతా రూ.36 లక్షలు చెల్లించాలి.
- ఇన్షూరెన్స్ ఖర్చు: అదనంగా, వాహన బీమా కోసం యజమాని చెల్లించిన రూ.87,000ను కూడా చెల్లించాలి.
- వాహనం స్వాధీనం: రూ.36.87 లక్షలు అందిన తర్వాత, వినియోగదారుడు వాహనాన్ని ఫోర్డ్ ఇండియాకు అప్పగించాలి, ఆ వాహనం కంపెనీ ఆస్తిగా మారుతుంది.
- కేసు ముగింపు: చెల్లింపు జరిగిన వెంటనే, రాష్ట్ర కమిషన్ విధించిన అటాచ్‌మెంట్ ఉత్తర్వులు రద్దవుతాయి మరియు ఇరు పక్షాల మధ్య అన్ని వివాదాలు ముగుస్తాయి.
తీర్పు ప్రాధాన్యత:
ఈ తీర్పు ఆటోమొబైల్ తయారీదారులపై నాణ్యత బాధ్యతలను బలోపేతం చేస్తూ, వినియోగదారుల హక్కుల రక్షణలో ఒక మైలురాయిగా నిలుస్తోంది. ఫోర్డ్ ఇండియా తరపున ఎ. కార్తిక్, అరుంధతి కట్జు మరియు వినియోగదారు తరపున కవీతా వాడియా, మనిక్య ఖన్నా వంటి న్యాయవాదులు వాదించారు. న్యాయనిపుణులు, ఈ తీర్పు భవిష్యత్ కేసుల్లో వినియోగదారులకి న్యాయం అందించేందుకు మార్గదర్శకంగా పనిచేస్తుందని అభిప్రాయపడుతున్నారు.
న్యాయ విద్యార్ధుల పాత్ర:
న్యాయ విద్యార్థి దశ నుండే మన హక్కుల గురించి సమగ్రమైన మరియు ఆధునిక అవగాహనను పెంచుకోవడం అత్యంత అవసరం. మనకు హక్కుల గురించి కనీస అవగాహన ఉంటేనే, జరిగే అన్యాయాలను సరిగ్గా గుర్తించి, వాటి మీద సమర్థవంతంగా, ధైర్యంగా, మరియు నిర్ణయాత్మకంగా పోరాడే సామర్థ్యం వస్తుంది. ఈ అవగాహన లేకుంటే, హక్కుల ఉల్లంఘనలు సాధారణ సంగతిగా మారి, వాటిని సహించే లేదా నిస్సహాయంగా ఉండే స్థితికి మనం దిగజారుతాం.
విద్యార్థి దశలోనే లీగల్ అంశాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడం ద్వారా వాస్తవ రంగంలో ప్రాక్టికల్ అనుభవాన్ని సమీకరించుకోవచ్చు. ఈ రకమైన పరిజ్ఞానం రానున్న రోజుల్లో సమాజంలో న్యాయం కోసం అవిరామంగా పోరాడే, ప్రతిభావంతమైన, సమర్థవంతమైన న్యాయవాదులుగా తీర్చిదిద్దేందుకు సహాయపడుతుంది. న్యాయ విద్య కేవలం థియరిటికల్ జ్ఞానానికి పరిమితం కాకుండా, వాస్తవ జీవితంలో అన్యాయాలను ఎదుర్కొనే శక్తివంతమైన ఆయుధంగా మారాలి. నేటి తరం విద్యార్థులు ఈ బాధ్యతను ముందుకు తీసుకెళ్లడం ద్వారా, రేపటి సమాజపు న్యాయస్థాపనలో ఒక విప్లవాత్మక పునరుద్ధరణకు బాటలు వేసినట్లవుతుంది.
న్యాయం ఒక హక్కు కాదు, ఇది మన జీవన విధానం కావాలి.
తీర్పు కాపి కోసం ఇక్కడ క్లిక్ చేయ్యండి
పవన్ శ్రీపతి
మొబైల్: 8790128781
మెయిల్: [email protected]