దివ్యాంగులకు నియామకాలతో పాటు ప్రమోషన్లలోనూ రిజర్వేషన్: సుప్రీంకోర్టు తీర్పు

దివ్యాంగులకు ఉద్యోగ నియామకాలతో పాటు పదోన్నతుల్లోనూ రిజర్వేషన్ కల్పించాలన్న సుప్రీంకోర్టు తీర్పు దివ్యాంగుల హక్కులను బలపరచింది. RBI వర్సెస్ ఏ. కె. నాయర్ కేసులో వచ్చిన ఈ తీర్పు, సమాన అవకాశాలపై భారత న్యాయవ్యవస్థ నిబద్ధతను ప్రతిబింబించింది.

దివ్యాంగులకు నియామకాలతో పాటు ప్రమోషన్లలోనూ రిజర్వేషన్: సుప్రీంకోర్టు తీర్పు
Supreme Court of India

దివ్యాంగ ఉద్యోగులకు నియామకాలతో పాటు ప్రమోషన్లలోనూ రిజర్వేషన్ కల్పించాలన్న కీలక తీర్పు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వర్సెస్ ఏ. కె. నాయర్ అండ్ అదర్స్ (సివిల్ అప్పీల్ నెంబర్ 529 ఆఫ్ 2023) కేసులో సుప్రీంకోర్టు వెలువరించింది. ఈ తీర్పు దివ్యాంగుల హక్కులను కాపాడటంలో ఒక మైలు రాయిలాంటిదని చెప్పుకోవచ్చు.


కేసు వివరాలు:

ఏ. కె. నాయర్ అనే వ్యక్తి 1990లో దివ్యాంగుల కోటాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)లో నాణేల పరిశీలకుడిగా (కాయిన్ అనాలసిస్ట్) ఉద్యోగం పొందారు. పదోన్నతికి కోసం 2003లో క్లాస్-1 పోస్టు (అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ A) గాను జరిగిన ఆల్ ఇండియా మెరిట్ పరీక్ష రాశారు. కానీ, అర్హత పొందడానికి సాధారణ అభ్యర్థులతో సమానంగా మార్కులు సాధించాల్సి ఉండగా, నాయర్‌కు అర్హత మార్కుల కంటే మూడు మార్కులు తక్కువ వచ్చాయి.

కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు మార్కుల సడలింపు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో 1995 వికలాంగుల చట్టం (సమాన అవకాశాలు, హక్కుల రక్షణ, పూర్తి భాగస్వామ్యం) చట్టంలోని సెక్షన్ 33 ప్రకారం తనకూ మార్కుల సడలింపు ఇచ్చి పదోన్నతి ఇవ్వాలని నాయర్ ఆర్‌బీఐ అధికారులకు దరఖాస్తు పెట్టుకున్నారు. ఈ సెక్షన్ ప్రభుత్వ రంగంలో గుర్తించిన పోస్టులలో దివ్యాంగులకు 3% రిజర్వేషన్ (దృష్టి లోపం, వినికిడి లోపం, శారీరక లోపం కేటగిరీలకు 1% చొప్పున) ఇవ్వాలని చెబుతుంది. కానీ, ఆర్‌బీఐ ఈ సెక్షన్ నియామకాల సందర్భంలో మాత్రమే వర్తిస్తుందని పేర్కొంటూ అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో, నాయర్ 2006 సెప్టెంబర్ 27న బొంబాయి హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు.


హైకోర్టు తీర్పు:

బొంబాయి హైకోర్టు 2005 డిసెంబర్ 29 నుంచి ఆర్‌బీఐలో గ్రూప్ ఏ మరియు బి పోస్టులకు సంబంధించి నియామకాలు మరియు ప్రమోషన్లలో దివ్యాంగులకు రిజర్వేషన్ అమలు చేయాలని ఆదేశించింది. ఈ తీర్పుపై RBI సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.


సుప్రీంకోర్టు తీర్పు:

రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం తన ప్రత్యేక అధికారాలను వినియోగించి, సుప్రీంకోర్టు (జస్టిస్ ఎస్. రవీంద్ర భట్ మరియు జస్టిస్ దీపాంకర్ దత్తా బెంచ్) 2023 జూలై 4న ముఖ్యమైన తీర్పునిచ్చింది. 1995 చట్టంలోని సెక్షన్ 33ని విస్తారంగా అర్థం చేసుకుని, దివ్యాంగులకు ఉద్యోగాలతో పాటు పదోన్నతుల్లో కూడా రిజర్వేషన్ అమలు చేయాలని స్పష్టం చేసింది.

ఈ చట్టంలో పదోన్నతుల గురించి స్పష్టమైన ప్రస్తావన లేకపోయినా, దివ్యాంగ ఉద్యోగులు వివక్షకు గురి కాకుండా సమాన అవకాశాలు పొందాలన్న చట్టం యొక్క ఆశయాన్ని కోర్టు గుర్తించింది.

సుప్రీంకోర్టు ఆర్‌బీఐ వైఖరిని తప్పుపట్టింది. నాయర్‌కు మార్కుల సడలింపు ఇవ్వకపోవడం మరియు గ్రూప్ ఏ పదవుల్లో రిజర్వేషన్ కోసం తగిన పదవులను గుర్తించకపోవడం సరికాదని తెలిపింది.


నాయర్‌కు కోర్టు ఇచ్చిన ప్రయోజనాలు:

  • 2006 సెప్టెంబర్ 27 (రిట్ పిటిషన్ దాఖలు చేసిన తేదీ) నుంచి నోషనల్ పదోన్నతి
  • 2014 సెప్టెంబర్ 15 (హైకోర్టు ఆదేశాల అమలు చివరి తేదీ) నుంచి వాస్తవ పదోన్నతి ఇవ్వాలని ఆదేశించింది.

తీర్పు ప్రాముఖ్యత:

ఈ తీర్పు దివ్యాంగుల నియామకాల మరియు కెరీర్ పురోగతిలో సమాన అవకాశాలు కల్పించాలన్న 1995 చట్ట లక్ష్యాన్ని బలపరిచింది. దివ్యాంగుల హక్కులను కాపాడటానికి మార్గనిర్దేశం చేసింది. ఈ తీర్పు భారత న్యాయవ్యవస్థ దివ్యాంగులకు న్యాయం చేయడంలో తన నిబద్ధతను మరోసారి నిరూపించిందని చెప్పుకోవచ్చు.

గమనిక: ప్రస్తుతం 1995 వికలాంగుల చట్టం రద్దయింది. దాని స్థానంలో ‘రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్ 2016 (RPWD Act 2016)’ అమలులో ఉంది.

Regards

పవన్ శ్రీపతి
B.Sc, PGDAEM, (LL.B), (MA. Pol. Sci)
Mobile: 8790128781
Email: [email protected]